ఎన్టీఆర్ ఇలా... చరణ్ అలా!
on Apr 24, 2020
అల్లరి చేయడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇద్దరూ ఇద్దరేనని... ఇద్దరూ ఎక్కువ అల్లరి చేస్తారని దర్శక ధీరుడు రాజమౌళి వ్యాఖ్యానించారు. అయితే... అల్లరి చేయడంలో ఇద్దరిలో ఉన్న ఒక వ్యత్యాసాన్ని ఆయన బయటపెట్టారు. ఎన్టీఆర్ కనిపించేలా అల్లరి చేస్తే... చరణ్ చేసే అల్లరి కనిపించదని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వాళ్లిద్దరితో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సెట్‌లో వాళ్లిద్దరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి సీరియస్ మోడ్‌లోకి తీసుకువెళ్లడం తనకు కష్టమైన పని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, చరణ్ ఒక దగ్గరకు వస్తే ఒకరినొకరు గిల్లుకోవడం, వెక్కిరించుకోవడం వంటివి చేస్తారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ హీరోగా 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలు చేశారు రాజమౌళి. రామ్ చరణ్ హీరోగా 'మగధీర' తీశారు. ఆ సినిమాలు చేసినప్పటికీ... ఇప్పటికీ ఇద్దరిలో వ్యక్తిగతంగా ఎటువంటి మార్పులు లేవనీ, నటన పరంగా ఇద్దరూ పరిణితి చెందారని రాజమౌళి తెలిపారు.